తెలుగును ఆంధ్రం అని అనడంతో పాటు ఇంకా పలు రకాలుగా పిలుస్తారు. మనది ద్రావిడ భాష కావడం, ఇరుగుపొరుగు తమిళం, కన్నడం కావడం వల్ల ఆయా భాషల సాహిత్యంలో కూడా తెలుగు ప్రస్తావన ఉంది. తమిళ, కన్నడ ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లో తెలుగును వడుగ, వడగ, తెలింగ, తెలుంగు అని రాశారు. పోర్చుగీస్ వారు జెంతియో, జెంతూ అని పిలిచే వారు. కొందరు విదేశీయులు తెలుగూస్ అని కూడా పిలిచారు. అయితే ఆంధ్రం, తెలుగు, తెనుగు ఈ మూడు పదాలే ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఈ మూడింటిలో కూడా ఆంధ్రం అతి ప్రాచీనమైన పదం.
ఆంధ్ర అనే పదాన్ని తెలుగు వాళ్లకు పెట్టింది ఆర్యులు. హిమాలయాలు, వింధ్య పర్వతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆర్యావర్తనం అని ఒకప్పుడు వ్యవహరించే వారు. ఈ ఆర్యావర్తనంలోని ఆర్యులకు.. దక్షిణాదిన ఉన్న వారి గురించి పెద్దగా తెలియదు. వింధ్యకు దిగువున ఉన్న వారిని అంధ దేశంగా పేర్కొన్నారు. అదే కాలక్రమంలో అంధ్ర, ఆంధ్రగా మారిందనేది భాషా నిపుణుల అభిప్రాయం. రుగ్వేదంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. రుగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణం(క్రీ.పూ.800-600)లో ఆంధ్ర పదాన్ని తొలిసారిగా ఒక జాతి వాచకంగా ఉపయోగించారు. నిజానికి ఇండియాలోకి ఆర్యుల రాక ముందు నుంచే మూల ద్రావిడ భాష ఉంది. కాలక్రమంలో ఈ ద్రావిడులు వేర్వేరు కారణాల దక్షిణాదికి మాత్రమే పరిమితం అయ్యారు.
వ్యాస మహర్షి రచించిన భారతంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. సహదేవుడు ద్రావిడుల్ని, ఆంధ్రుల్ని, మరికొన్ని జాతుల్ని జయించినట్లుగా వ్యాసుడు రాశారు. ద్రావిడులను, ఆంధ్రులను వేర్వేరుగా చూశారు. నిజానికి తెలుగు వాళ్లు ద్రావిడంలో అంతర్భాగం. వాల్మీకి రామాయణంలో కూడా ఆంధ్ర ప్రస్తావన ఉంది. సీతను వెతకడం కోసం ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్యాది దేశాలు తిరగాలని సుగ్రీవుడు వానరులకు చెప్పినట్లుగా ఉంది. ఇంకా పలు పురాణాల్లో ఆంధ్ర శబ్దం కనిపిస్తుంది.
క్రీ.పూ.300ల ప్రాంతంలో చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానాన్ని గ్రీకు రాయబారి మెగస్థనీస్ సందర్శించారు. ఆనాటికి దేశంలో మౌర్యుల తరువాత అంత బలంగా ఉన్నది ఆంధ్రులు మాత్రమేనని ఈ రాయబారి గ్రంథస్తం చేశారు. ముప్పది దుర్గాలు, లక్ష కాల్బలం, 2 వేల అశ్వదళం, వేయి ఏనుగుల చతురంగ బలాలను ఆంధ్రులు కలిగి ఉన్నారని చెప్పారు. ఈ స్థాయికి ఆంధ్రులు వచ్చారంటే.. అప్పటికి కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచే ఆంధ్ర జాతి బలంగా ఉండి ఉంటుంది. క్రీ.పూ.3వ శతాబ్దంలో అశోకుడు వేయించిన ధర్మ శిలా శాసనంలో ఆంధ్రులు అశోకుడి సామ్రాజ్యంలో భాగంగా ఉన్నరని ఉంది.
ఆంధ్ర శబ్దానికి రకరకాల అర్థాలు చెప్పారు.
1.అంధ=చీకటిని, రః=నాశనం చేసే వాడు
2.అంధ=నీటి మీద, రః: గమనం చేసే వాడు
3.అంధ=అన్నం, రః=హస్తంగా కలవాడు (అన్నదాత)
అంధ శబ్దానికి రన్ ధాతువు ఏర్పడటం వల్ల ఆంధ్ర శబ్దం ఏర్పడింది. అంధ అంటే గుడ్డి, చీకటి అనే అర్థాలు సరిపోతాయి. ఆంధ్రుల గురించి ఆరుల్యకు తెలియకపోవడం వల్ల అంధ దేశమనే పేరును పెట్టారు. ఇది ఆంధ్ర పదం సంగతి.
ఇప్పుడు తెలుగు, తెనుగు పదాల సంగతి చూద్దాం.
త్రిలింగ శబ్దం నుంచి తెలుగు వచ్చిందని కొందరు చెబుతారు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశంగా వ్యవహరించారు. త్రిలింగంలో ఉండే వాళ్లను తెలుగు వారని వ్యుత్పత్తిని రూపొందించారు. నిజానికి త్రిలింగ శబ్దం కంటే తెలుగు శబ్దం చాలా ప్రాచీనమైంది. దాని నుంచే సంస్కృత పదమైన త్రిలింగ శబ్దాన్ని సృష్టించారని కొమర్రాజు లక్ష్మణరావు వివరించారు.
మూల ద్రావిడ భాషలో తెళ్ అనే ధాతువు ఉంది. దీనికి స్పష్టమైన, బుద్ధి గల, ప్రకాశమైన అనే అర్థాలు ఉన్నాయి. దీనికి గు అనే ప్రత్యయం చేరి తెలుగు అయిందని ఎక్కువ శాతం మంది భాషావేత్తలు అభిప్రాయపడ్డారు. విరుగు, కరుగు, గొడుగు పదాల్లో గు ప్రత్యయం ఉంది. దీనివల్లే తెలుగు అనే పదం ఎలా పుట్టింది అనే దానికి చాలా మంది రకరకాల వ్యుత్పత్తులు చెప్పినప్పటికీ తెళ్+గు అనేదే సమంజసంగా తోస్తుంది.
తెలుగు అనే పదమే వాడుకలో తెనుగు అయింది. ల కారం న కారం కావడం, న కారం ల కారం కావడం తెలుగు భాషలో అతిపెద్ద వర్ణ పరిణామం.
ఉదా: లాంగలి-నాగలి, లేదు-నేదు
మునుగు-ములుగు, సెనగలు-సెలగలు
ఇదే పద్ధతిన తెలుగు కూడా తెనుగుగా వ్యవహారంలోకి వచ్చింది. ఇక అరసున్నాను పెట్టి కూడా తెలుగు, తెనుగు శబ్దాలను కవులు ప్రయోగించారు.
ఆంధ్ర, తెలుగు శబ్దాల్లో ఆంధ్రను కవులు వాడితే తెలుగు శబ్దాన్ని ఎక్కువగా సామాన్య జనం వాడుతూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఎవరిని అడిగినా తాము తెలుగు వాళ్లు అని చెబుతారే తప్ప ఆంధ్రులమని చెప్పుకోరు. సంస్కృత ప్రభావం బలంగా ఉండటం తెలుగు వాళ్లు నివసించే ప్రాంతానికి తెలుగు దేశం అనే పేరు కంటే ఆంధ్ర దేశం అనే పేరు గట్టిగా నాటుకుపోయింది. చివరకు ఈ ఆంధ్ర శబ్దం రెండు తెలుగు ప్రాంతాల మధ్య గొడవకు దారి తీసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలు మాత్రమే వస్తాయి. తెలంగాణాలో ఆంధ్ర శబ్దం ఇప్పుడు కోస్తా, సీమల నుంచి వచ్చిన వారికే మాత్రమే వర్తిస్తోంది. వారిని సీమాంధ్రులని పిలుస్తున్నారు.
మొత్తం మీద ఆంధ్ర శబ్దం బయటి నుంచి వచ్చింది. తెలుగు శబ్దం భాషకు మూలమైన మూల ద్రావిడ భాష నుంచి వచ్చింది. బయటి నుంచి వచ్చిన ఆంధ్ర శబ్దం కఠినంగా ఉండటం వల్ల దాన్ని జనబాహుళ్యం సొంతం చేసుకోలేదు. తెలుగు అంటేనే సరళం. పలకడానికి సులభంగా ఉన్న పదాలను మాత్రమే తెలుగు వాళ్లు ఇష్టపడతారు. ఇందువల్ల తెలుగు భాషలో మాటకు, రాతకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎలా మాట్లాడతారో అలాగే రాసే భాషల్లో తెలుగు భాష ముందు వరుసలో ఉంటుంది.
January 11, 2019 — magnon