న‌దుల అనుసంధానంపై పునరాలోచ‌న‌

న‌దుల అనుసంధానం అనేది ఒక అల్ట్రా మెగా ప్రాజెక్ట్‌. దీని ఉద్దేశం భార‌త ఉప‌ఖండంలోని న‌దుల‌ను అనుసంధానం చేయ‌డం. ఉత్త‌ర‌, ఈశాన్య ద‌క్షిణ భారతాల్లోని న‌దుల‌ను క‌ల‌ప‌డం. ఈ అనుసంధానంలో భాగంగా భారీ రిజ‌ర్వాయ‌ర్లు, మెగా డ్యాములు నిర్మిస్తారు. అతిపెద్ద కాలువ‌లు త‌వ్వుతారు. ఈ మ‌హాయ‌జ్ఞం ప్ర‌ధాన ఉద్దేశం ఉత్త‌ర భార‌తం, ఈశాన్య భార‌తాల్లో వ‌ర‌దల తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డం. ఆ వ‌ర‌ద నీటిని మ‌ధ్య, ప‌శ్చిమ, ద‌క్షిణ భార‌తాల్లో తీవ్ర నీటి కొర‌త‌ను ఎదుర్కొంటోన్న‌ దుర్భిక్ష ప్రాంతాల‌కు మ‌ళ్లించ‌డం.

Written by: Sakthi S

Translated by: Chandrasekhar G

ఇండియాలో న‌దుల అనుసంధానాన్ని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుగా చూస్తున్నారు. దీన్ని “జాతీయ ప్రాజెక్టు”గా ప‌రిగ‌ణిస్తున్నారు. ఏదైనా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టిస్తే దానికి జాతీయ ప్రాధాన్యం వ‌స్తుంది. త‌ద్వారా ప‌ర్యావ‌ర‌ణ, అట‌వీ అనుమ‌తుల‌ను పొంద‌డం సుల‌భ‌మ‌వుతుంది. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే. రెండో వైపు వినాశ‌నం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ విప‌త్తును రాజ‌కీయ నాయ‌కులు ప‌ట్టించుకునే అవ‌కాశం ఉండ‌దు. ప‌ట్టించుకున్నా పొడిపొడిగా నాలుగు మాట‌లు మాట్లాడి ఊరుకుంటారు. న‌దుల అనుసంధానం దేశాభివృద్ధికి తోడ్ప‌డుతుంద‌ని.. సంప‌ద సృష్టిస్తుంద‌ని చెబుతారు. కానీ వీరి మాట‌ల‌తో ప‌లువురు ప్ర‌కృతి ప్రేమికులు, ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు విభేదిస్తున్నారు. ప్ర‌భుత్వం చేప‌డుతోన్న న‌దుల అనుసంధానాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. “జాతీయ ప్రాజెక్టులు”గా ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభం కంటే, వీటి వ‌ల‌న క‌లిగే విప‌త్తులు భ‌యానకంగా ఉంటాయ‌ని, ఈ న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకోవ‌డం అసాధ్య‌మ‌వుతుంద‌ని వారు హెచ్చరిస్తున్నారు.

ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల కింద‌ట న‌దుల ఆవిర్భావం జ‌రిగింది. ప్ర‌కృతి ఈ న‌దులను ఎంచుకుంది. వాటి పుట్టుక‌, ప్ర‌వాహం, ఏ స‌ముద్రాలు, మ‌హా స‌ముద్రాల్లో క‌ల‌వాలి లాంటి అంశాల‌ను ప్ర‌కృతి త‌న‌దైన రీతిలో నిర్ణ‌యించుకుంది. భూమ్మీద పుట్టిన ప్ర‌తి న‌ది.. స‌ముద్రంలో క‌ల‌వ‌డం లేదు. కొన్ని న‌దులు భూమిని దాటుకుని ఉన్న స‌ముద్రంలో కాకుండా న‌లువైపులా భూమి ఉన్న స‌ముద్రాల్లో క‌లుస్తున్నాయి. ఉదాహ‌ర‌ణకు కాస్పియ‌న్ స‌ముద్రం, అర‌ల్ స‌ముద్రం. నిజానికి ఇవి స‌హ‌జసిద్ధంగా ఏర్ప‌డిన స‌ర‌స్సులు. అయితే వాటి భారీ ప‌రిమాణం కార‌ణంగా స‌ముద్రాల‌ని పిలుస్తున్నారు. ప్ర‌కృతి చూడ్డానికి చాలా స‌ర‌ళంగా క‌నిపిస్తుంది. కానీ త‌ర‌చి చూస్తే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఓ ప‌ట్టానా అంతుబ‌ట్ట‌దు. ఇందుకు ప్ర‌కృతి త‌న‌దైన‌ కార‌ణాల‌ను సృష్టించుకుంది. అవి ఏంట‌న్న‌ది ఆధునిక సైన్స్ ఇంకా చేధించ‌లేక‌పోతోంది.

ప్ర‌తి న‌దికి ఒక ప్ర‌త్యేక‌మైన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ ఉంటుంది. న‌ది పుట్టిన ద‌గ్గ‌ర నుంచి స‌ముద్రంలో క‌లిసే దాకా ఈ వ్య‌వ‌స్థ‌లో వంద‌ల కొద్దీ జీవ‌జాతులు ఉంటాయి. న‌దుల అనుసంధానాన్ని కేవ‌లం కాలువ‌లు క‌ల‌ప‌డం అనే కోణం నుంచి మాత్ర‌మే చూడ‌కూడ‌దు. న‌దులు.. భారీ జీవ వ్య‌వ‌స్థ‌ల‌కు ఆలంబ‌న‌గా ఉంటాయి. మ‌నిషి చేప‌ట్టే అభివృద్ధి ప్రాజెక్టుల వ‌ల్ల ఈ వ్య‌వ‌స్థ‌ల‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంది. ఈ న‌ష్టానికి మ‌న క‌ళ్లెదురుగా స‌జీవ సాక్ష్యం ఉంది. న‌దుల‌ను దారి మ‌ళ్లించ‌డం వ‌ల్ల పెను విప‌త్తు సంభ‌విస్తుంద‌ని.. మ‌నిషితో పాటు త‌న చుట్టూ ఉండే ప‌ర్యావ‌ర‌ణానికి కోలుకోలేనంత దెబ్బ ప‌డుతుంద‌ని ఈ సాక్ష్యం వివ‌రిస్తోంది.

శాటిలైట్ తీసిన ఫోటోల్లో క‌నిపిస్తోన్న ఈ  అర‌ల్ స‌ముద్రం, ర‌ష్యా, దాని చుట్టు ప‌క్క‌ల దేశాల్లో ఉంది. ఈ దేశాల‌న్నీ ఒక‌ప్పుడు సోవియ‌ట్ యూనియ‌న్‌(USSR)గా ఉండేవి. 1950లు, 60ల‌లో ఈ సోవియ‌ట్ యూనియ‌న్‌.. అర‌ల్ స‌ముద్రంలోకి ప్ర‌వ‌హించే న‌దుల‌ను దారి మ‌ళ్లించింది. దుర్భిక్ష ప్రాంతాల్లో నీటి పారుద‌ల కోసం, వ్య‌వ‌సాయాభివృద్ధి కోసం ఈ నీటిని తీసుకెళ్లింది. మొద‌ట్లో ఒక న‌దితో మొద‌లుపెట్టి క్ర‌మంగా అన్ని న‌దుల్ని దారి మళ్లించారు. దీని ఫ‌లితంగా, సంవ‌త్స‌రాలు గ‌డిచే కొద్దీ అర‌ల్ స‌ముద్రం ఎండిపోవ‌డం మొద‌లుపెట్టింది. అర‌ల్ స‌ముద్రం భూమ్మీద నాలుగో అతిపెద్ద స‌రస్సు. నిజానికి ఇది స‌రస్సు అయిన‌ప్ప‌టికీ ప‌రిమాణంలో చాలా పెద్ద‌గా ఉన్నందున దీన్ని స‌ముద్ర‌మ‌ని పిలుస్తారు. మ‌నిషి త‌న కోసం చేప‌డుతోన్న అభివృద్ధి ప్రాజెక్టుల వ‌ల్ల ఎంత భారీ న‌ష్టం వాటిల్లుతుంది అని చెప్ప‌డానికి అర‌ల్ స‌ముద్రం ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స‌ముద్ర‌మంత స్థాయిలో ఉన్న స‌రస్సును కూడా చంపేయ‌గ‌ల‌వ‌ని నిరూపిత‌మైంది. 1990లు వ‌చ్చే నాటికి అర‌ల్ స‌ముద్రం త‌న ఒరిజిన‌ల్ సైజులో కేవ‌లం ప‌దోవంతుకు త‌గ్గిపోయింది. ఒక మృత స‌ముద్రంలా మారిపోయింది. చేప‌ల జాడ లేకుండా పోయింది. దీనివ‌ల్ల స్థానిక ఆర్థిక వ్య‌వ‌స్థ తిరోగ‌మ‌నంలోకి వెళ్లిపోయింది. అంటే అర‌ల్ స‌ముద్రం మీద ఆధార‌ప‌డిన వారి బతుకులు దుర్భ‌రంగా మారిపోయాయి. ఇందులోని చేప‌లు ప‌ట్టుకుని పొట్ట పోసుకునే వారికి జీవితాలు ఛిద్రమైపోయాయి.

మ‌రోవైపు అర‌ల్ స‌ముద్రంలోకి వ‌చ్చే నీటిని క‌రువు ప్రాంతాల్లోకి మ‌ళ్లించ‌డం వ‌ల్ల దుష్ఫ‌లితాలు రావ‌డం మొద‌లైంది. ఈ నీటితో పండిస్తోన్న ప‌త్తి వ‌ల్ల ఆశించిన ప్ర‌యోజ‌నాలు రాలేదు. తొలుత కొన్ని సంవ‌త్స‌రాల పాటు నీటి మ‌ళ్లింపు మేలు చేసింది. లాభాల పంట పండించింది. నీటిని అందుకున్న క‌రువు ప్రాంతం అతిపెద్ద ప‌త్తి ఎగుమ‌తి దారుగా మారింది. అయితే ఇది తాత్కాలిక ఆనందమే అయింది. సంవ‌త్స‌రాలు గ‌డుస్తూ వ‌చ్చే కొద్దీ దారి మ‌ళ్లించిన నీటిలో 30 నుంచి 75 శాతం వృథాగా పోవ‌డం మొద‌లైంది. కాలువల‌కు లీకేజీలు ఏర్ప‌డ‌టం, నీరు ఆవిరి కావ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో ఈ భారీ ప్రాజెక్టు ఒక విపత్తుగా మారింది. ఆ త‌రువాత UNESCO, అర‌ల్ స‌ముద్రం నీటి మ‌ళ్లింపును ఒక “ఎన్విరాన్‌మెంట‌ల్ ట్రాజెడీ(ప‌ర్యావ‌ర‌ణ విషాదం)”గా ప్ర‌క‌టించింది. ఈ భూమి చూసిన అతిపెద్ద ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తుల్లో ఒక‌టని పేర్కొంది.

ఇప్పుడు ఈ దేశాలు గత తప్పుల నుండి గుణ‌పాఠాలు నేర్చుకున్నాయి. కజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు సంయుక్తంగా అర‌ల్ సముద్రాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు అరాల్ స‌ముద్ర ప్రాంతాన్ని “అర‌ల్‌కులం ఎడారి” అని పిలుస్తున్నారు.

ప్ర‌కృతిసిద్ధంగా ఏర్ప‌డిన‌ వ్యవస్థలు సంక్లిష్టంగా ఉంటాయి. అభివృద్ధి పేరు చెప్పి మ‌నిషి ఈ వ్య‌వ‌స్థ‌ల్లో జోక్యం చేసుకుంటే పూడ్చ‌లేనంత స్థాయిలో న‌ష్టం క‌లుగుతుంది. భారతదేశంలో “న‌దుల అనుసంధానం” కోసం కాలువలు, ఆనకట్టలు, జలాశయాలు నిర్మించాలంటే భారీ ప‌రిమాణంలో భూమి అవసరం. చాలా అటవీ ప్రాంతాలు శాశ్వతంగా నాశనమవుతాయి. వన్యప్రాణి నివాస ప్రాంతాలు జలాశయాలలో మునిగిపోతాయి. ఫ‌లితంగా మ‌నుషుల‌కు, జంతువుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ పెరుగుతుంది. ప‌లు దేశాల‌తో పోలిస్తే ఇండియాలో స‌హ‌జ వ‌న‌రులు ఎక్కువ‌. ఇలాంటి వ‌న‌రులు ఉన్న దేశాలు ఇండియా మాత్రమే కాకుండా మ‌రో 16 ఉన్నాయి. అవి USA, మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, వెనిజులా, బ్రెజిల్, కాంగో, దక్షిణాఫ్రికా, మ‌డగాస్కర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, పాపువా న్యూ గినియా, చైనా & ఆస్ట్రేలియా.

న‌దుల అనుసంధానం ప్రాజెక్టు వ‌ల్ల తీవ్ర స్థాయి సామాజిక‌-ఆర్థిక అస‌మాన‌త ఏర్ప‌డుతుంది. ఇది మ‌న ఊహ‌కంద‌నంత‌ స్థాయిలో ఉంటుంది. లక్షల మంది పేద ప్రజలు గూడు కోల్పోతారు. లక్షల హెక్టార్ల భూమి నీటిలో శాశ్వతంగా మునిగిపోతుంది. ప్రకృతి అనేది ఒక వ‌స్తువు కాదు.. మ‌న ఇష్టం వ‌చ్చిన‌ట్లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు వాడుకోవ‌డానికి.  ప్ర‌కృతి మన సంపద. మ‌న జీవితం. మ‌నిషి బ‌తికినంత కాలం ప్ర‌కృతి మీదే ఆధార‌ప‌డాలి. దేశంలోని లక్షలాది జీవ‌జాతుల ఆవాసాలను ఆక్రమించుకోవడానికి, నాశనం చేయడానికి మనకు ఎటువంటి నైతిక హక్కు లేదు. చిన్న చీమ నుంచి సీతాకోక చిలుక నుంచి అతిపెద్ద ఏనుగు దాకా ప్ర‌తి జీవికి ఈ అంద‌మైన భారతదేశంలో జీవించే హ‌క్కు ఉంది. ఇక్క‌డికి మ‌నిషి రాక ముందు నుంచే ఈ దేశంలోని కొండ‌కోన‌ల్లో ప్ర‌తి చోటా ప‌క్షులు, జంతువులు ఎలాంటి భ‌యం లేకుండా సంకోచం లేకుండా స్వేచ్ఛ‌గా విహ‌రించాయి. గ‌డిచిన 100 సంవ‌త్స‌రాల్లో ప‌రిస్థితులు చాలా మారిపోయాయి. మ‌నం వాటి స‌హ‌జ ఆవాస స్థ‌లాల‌ను లాక్కున్నాం. వన్యప్రాణుల అభ‌యార‌ణ్యాల్లో, జాతీయ పార్కుల్లో వాటిని బంధించాం.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్లు, “ఈ భూమ్మీద నుంచి తేనెటీగ‌లు అంత‌రించి పోతే ఆ త‌రువాత నాలుగు సంవ‌త్స‌రాల‌కే మ‌నిషి మ‌నుగ‌డ ముగిసిపోతుంది”.

అభివృద్ధి పేరుతో ప్రకృతి నాశనం చేయ‌డం అంటే ఆత్మహత్య చేసుకోవ‌డంతో స‌మానం.

రెఫరెన్స్‌లు :
http://mowr.gov.in/schemes-projects-programmes/schemes/interlinking-rivers
https://www.indiatvnews.com/news/india-pm-modi-rs-5-5-lakh-crore-river-linking-project-ambitious-plan-deal-with-droughts-floods-400170
https://www.downtoearth.org.in/coverage/the-debate-on-interlinking-rivers-in-india-13496
https://timesofindia.indiatimes.com/india/govt-may-declare-inter-state-river-linking-projects-as-national-projects/articleshow/62544432.cms
https://www.jagranjosh.com/general-knowledge/advantages-and-disadvantages-of-interlinking-rivers-in-india-1506409679-1
https://www.geoecomar.ro/website/publicatii/Nr.19-2013/12_mehta_web_2013.pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *