గ‌త‌మంతా చెత్త కాదు.. బంగార‌మూ ఉంది!

కాలం ప‌రిగెడుతూ ఉంటుంది. దాన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. కాలంతో పాటు మ‌నిషి అల‌వాట్ల‌లో ఎన్నో మార్పులు వ‌స్తుంటాయి. సంప్ర‌దాయంగా వ‌స్తోన్న వాటిని ప‌క్క‌న ప‌డేసి కొత్తద‌నం కోసం అర్రులు చాస్తుంటారు. ఇందువ‌ల్లే పాత ఒక రోత‌.. కొత్త ఒక వింత అనే సామెత కూడా వ‌చ్చింది. అయితే గ‌తమంతా చెత్త అని తీసిపారేయ‌డానికి లేదు. వంద‌లు, వేల సంవ‌త్స‌రాలుగా సంప్ర‌దాయంగా వ‌చ్చిన వాటిలో బంగారం లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ బంగారాన్ని అందిపుచ్చుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఈ ప్ర‌య‌త్నంపై ఓ లుక్కేద్దాం.
Written by: G Chandra Sekhar

మ‌నిషికి నేడు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. దీని వ‌ల్ల స‌గటు ఆయుర్ధాయం పెరుగుతూ వ‌స్తోంది. ఒక‌ప్పుడు క‌ల‌రా లాంటి వ్యాధుల‌తో ఊళ్ల‌కు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయేవి. కానీ నేటి త‌రం కంటే కింద‌టి త‌రాల వాళ్లే ఎక్కువ ఆరోగ్యంగా ఉండే వారు. ఇందుకు కార‌ణం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరుతో స‌హా అన్నీ అప్ప‌ట్లో స్వ‌చ్ఛంగా ఉండేవి. త‌న చుట్టూ అందుబాటులో ఉన్న ఆహారాన్ని తిన‌డం, అందుకు త‌గ్గ శ్ర‌మ చేయ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాలేదు. ఆధునిక మ‌నిషికి అధిక బ‌రువు, ఊబ‌కాయం ఒక స‌హ‌జ‌మైన స‌మ‌స్య‌లుగా మారిపోయాయి. ఈ స‌మ‌స్య‌లు జంతువుల‌కు ఎందుకు ఉండ‌వు? ఎందుకంటే జంతువుకు నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి జీవితం ఒక ప‌రుగులా ఉంటుంది. వేట కోసం ప‌రిగెట్టాలి. మ‌రో జంతువు వేట నుంచి త‌ప్పించుకోవాలి. ప‌రిగెట్టే శ‌రీరం ఎంత ఫిట్‌గా ఉంటుందో చిరుత లాంటి జీవిని చూస్తే తెలుస్తుంది. జంతువులు త‌మకు అందుబాటులో ఉన్న తిండినే తింటాయి. మ‌నిషి లాగా బ‌ర్గ‌ర్లు, పిజ్జాల్లాంటి రుచుల కోసం ఆరాట‌ప‌డ‌వు. ప్ర‌కృతి నియ‌మాల‌కు ప్ర‌కారం మ‌నం త‌ర‌త‌రాలుగా పెరిగిన చోట అందుబాటులో ఉండే తిండిని రుతువుల ఆధారంగా తిన‌డం వ‌ల్ల చాలా ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని ద‌రి చేర‌కుండా చూసుకోవ‌చ్చు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిరు ధాన్యాల విప్ల‌వం న‌డుస్తోంది. కొర్ర‌లు, సామ‌లు, స‌జ్జ‌లు, రాగులు, జొన్న‌ల ధ‌ర‌లు ఏడాది కాలంలో అమాంతం పెరిగిపోయాయి. వేల సంవ‌త్స‌రాలుగా మ‌నిషి ఈ చిరు ధాన్యాల‌ను తింటూ పెరిగాడు. వీటిలో ల‌భించే పోషకాల‌కు అనుగుణంగా మ‌న శ‌రీర జీవ‌క్రియ‌లు రూపుదిద్దుకున్నాయి. గ‌డిచిన 40, 50 ఏళ్లుగా చిరు ధాన్యాల‌కు దూరం జ‌రుగుతూ మ‌ల్లెపూవు లాంటి అన్నానికి అల‌వాటు ప‌డ్డాం. మ‌రీ ముఖ్యంగా 15-20 సంవ‌త్స‌రాలుగా అయితే పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, కేకులు తెగ తినేస్తున్నారు. ఈ కొత్త రకం తిండిని అల‌వాటు చేసుకోవ‌డానికి మ‌న శ‌రీరానికి స‌మ‌యం స‌రిపోలేదు. ఏదైనా ఒక కొత్త విష‌యాన్ని అల‌వాటు చేసుకోవాన్ని కొన్ని త‌రాలు ప‌డుతుంది. ప‌రిణామ క్ర‌మం (ఎవ‌ల్యూష‌న్ థియ‌రీ) గురించి కాస్త అవ‌గాహ‌న ఉన్న వారికి ఈ విష‌యం బాగా అర్థ‌మ‌వుతుంది. మ‌నం శ‌రీరానికి స‌రైన స‌మ‌యం ఇవ్వ‌కుండా ఒక్క‌సారిగా కొత్త రకం ఆహార పదార్థాల‌ను పొట్ట‌లోకి డంప్ చేస్తుండ‌టంతో అది అనవ‌స‌ర‌మైన కొవ్వుగా మారుతోంది. ఓవ‌ర్ వెయిట్‌కు దారి తీస్తోంది. ఇంకా అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా కార‌ణ‌మ‌వుతోంది. ఈ అంశాన్ని కొంద‌రు ఖాద‌ర్‌వ‌ల్లీ లాంటి వారు సోష‌ల్ మీడియా ద్వారా చేసిన ప్ర‌చారంతో జ‌నం.. చిరు ధాన్యాల గురించి లోతుగా ఆలోచిస్తున్నారు. ఇందాకే చెప్పిన కొర్రెల లాంటి వాటితో పాటు అల‌సంద‌లు, పెస‌లు, శ‌న‌గ‌లు, కందులను రోజు వారీ ఆహారంలో భాగంగా చేసుకోమ‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు.  

 

మ‌ట్టిపాత్ర‌లు ఈ జ‌న‌రేష‌న్ వాళ్ల‌కు పెద్ద‌గా తెలియ‌దు. కానీ ఒక‌ప్పుడు ఈ మ‌ట్టి పాత్ర‌ల్లోనే వండుకునే వారు. తినే వారు. నాగ‌రిక‌త పెరుగుతూ వ‌చ్చే కొద్దీ ఇత్త‌డి, రాగి, అల్యూమినియం, స్టీల్ వంగి లోహ పాత్ర‌ల‌తో వంట‌లు చేయ‌డం అల‌వాటు చేసుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అయ‌తే టెఫ్లాన్ కోటింగ్, సిరామిక్‌తో చేసిన నాన్‌-స్టిక్ పాత్ర‌ల్లో తినడం అల‌వాటైంది. మారుమూల ప‌ల్లెల్లో కూడా మ‌ట్టి పాత్ర‌ల్లో వండ‌టం, తిన‌డం క‌నుమ‌రుగైంది. అయితే ఇప్పుడు మ‌ట్టి పాత్ర‌ల‌కు మ‌ళ్లీ డిమాండ్ వ‌చ్చే సూచ‌న క‌నిపిస్తోంది. ఈ పాత్ర‌ల్లో వండిన వంట‌లో పోష‌కాలు బాగుంటాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. దీనివ‌ల్లే మ‌ట్టితో త‌యారు చేసిన కుక్క‌ర్లు, పాన్‌లు, క‌డాయిలు మార్కెట్లో క‌నిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు ఈ మ‌ట్టి పాత్ర‌ల ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉండేవి. ఇప్పుడు వీటి వాడకం త‌క్కువ‌గా ఉన్నందున ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. 

 

రాగి చెంబులో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది అని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. కాల క్ర‌మంలో వీటి వాడకం బాగా త‌గ్గిపోయింది. అయితే ఇటీవ‌లి కాలంలో ప‌లువురు రాగితో చేసిన వ‌స్తువుల‌ను డైనింగ్ హాల్లో వాడుతున్నారు. వీటి ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల సామాన్యుల‌కు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వాట‌ర్ ప్యూరిఫ‌య‌ర్లు తయారు చేసే కంపెనీలు కూడా నీళ్ల‌ను శుద్ధి చేసే భాగాల‌తో రాగిని వాడుతున్నారంటే ఈ లోహానికి వ‌స్తోన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవ‌చ్చు. 

 

ప్లాస్టిక్ ప్ర‌పంచానికి ఎంత పెద్ద స‌మ‌స్య‌గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో రోడ్ల మీద తిరిగే ఆవులు, గేదెలు.. ఈ ప్లాస్టిక్‌ను తినేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నాయి. ఆ మ‌ధ్య ఒక ఏనుగు క‌డుపు నిండా ప్లాస్టిక్ ప‌దార్థాలు బ‌య‌ట‌ప‌డ్డాయంటే ఈ  భూతం ఎంత ఉప‌ద్ర‌వాన్ని తెచ్చిపెడుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ప‌రిస్థితుల్లో పేప‌ర్‌, కాట‌న్‌, నార‌తో త‌యారు చేసిన క్యారీ బ్యాగుల వైపు మ‌నిషి అడుగులు వేస్తున్నాడు. ప్లాస్టిక్ బ్యాగుల విషయంలో ప్ర‌భుత్వాలు చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య విశ్వ‌రూపం దాలుస్తోంది. త‌యారీ ద‌శ‌లోనే ఈ బ్యాగుల్ని నివారించ‌డం, రీసైకిల్ చేయ‌డం లాంటి, ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన బ్యాగుల్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా ప్లాస్టిక్ ఊబిలో నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లం. ప్ర‌జ‌ల్లో ఈ మేర‌కు కొంత చైత‌న్యం ప్రారంభ‌మైంది. ఎకో-ఫ్రెండ్లీ క్యారీ బ్యాగులు వాడటానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. 

 

రోళ్లు, తిర‌గ‌లి రాళ్ల గురించి చెబితే అవేంటివి.. టేస్ట్ బాగుంటాయా? అనే అడిగే ప‌రిస్థితి నేడుంది. మిక్సీలు, గ్రైండ్ల కాల‌మిది. అయితే రోట్లో నూరిన ప‌చ్చ‌డికి ఉండే రుచే వేరు. రోటి ప‌చ్చ‌డి అని ప్ర‌త్యేకంగా వ‌డ్డిస్తారంటే దానికున్న ప్రాధాన్యం అర్థ‌మ‌వుతుంది. ప‌చ్చ‌ళ్లు, వాటికి కావాల్సిన మ‌సాలాల‌ను రోట్లోనే నూరుకోవ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప‌నులు చాలా శ్ర‌మ‌తో కూడుకున్న‌వి. నిన్న‌టి భార‌తీయ మ‌హిళ‌లు దంచే ప‌నిని అల‌వోక‌గా చేసే వారు. దంచుడు చుట్టూ బోల‌డ‌న్ని పాట‌లు కూడా ఉన్నాయి. ఈ త‌రం వాళ్లు దంచే ప‌ని చేయ‌డం అంత సుల‌భం కాదు. పైగా అపార్ట్‌మెంట్లు అనే అగ్గిపెట్ట‌ల్లో దంచే అవ‌కాశం ఎక్కడ ఉంటుంది? అందుకే కొన్ని కంపెనీలు ప్ర‌త్యేకంగా రోట్లో దంచి త‌యారు చేసిన మ‌సాలాల‌ను ప్ర‌త్యేకంగా అమ్ముతున్నాయి. 

 

పాత‌కాలం త‌ర‌హాలో ఆట‌లు ఆడ‌టానికి, పాట‌లు పాడ‌టానికి కూడా ప్ర‌య‌త్నం అక్క‌డ‌క్క‌డా జ‌రుగుతోంది. ఈ త‌ర‌హా ఆట‌పాట‌ల వ‌ల్ల ఇరుగు పొరుగుతో క‌ల‌వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్ల‌ల చేత‌ గ్రామీణ ఆట‌ల‌ను ఆడించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. మొబైల్‌, వీడియో గేమ్‌ల వ‌ల్ల ఒంట‌రిత‌నం పెర‌గ‌డంతో పాటు పిల్ల‌ల్లో సున్నిత‌త్వం దెబ్బ‌తింటుంది. 

 

ఇంకా అరిటాకుల్లో భోజ‌నాలు చేయ‌డం, వ‌న భోజ‌నాలు, ప‌ట్టు లంగాలు, పావ‌డాలు లాంటి వాటిని అల‌వాటు చేసుకోవ‌డానికి అక్క‌డ‌క్క‌డా ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అరిటాకు, వ‌న భోజ‌నాలు మ‌న‌కు ప్ర‌కృతికి ద‌గ్గ‌ర చేస్తాయి. ప‌ట్టు బ‌ట్ట‌ల్లో ఆడ‌పిల్ల‌లు కినిపిస్తే ఆ ఆనంద‌మే వేరు. 

 

మొత్తం మీద గ‌తంలో ప‌నికొచ్చే విష‌యాలు చాలా ఉన్నాయి. వాట‌న్నంటిని ఇప్పుడు ఆచ‌రించ‌డం క‌ష్టం. కానీ అవ‌కాశం ఉన్న వాటిని అందిపుచ్చుకోవ‌డం వ‌ల్ల శారీర‌కంగా, మాన‌సికంగా ధృడంగా ఉంటాం.

 

——————————————————————————————————————————-

Disclaimer : The opinions expressed here belong solely to the author(s) and are not to be taken as the stated position(s) of Magnon or its subsidiaries.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *