భూమ్మీద ఏదీ నిశ్చలంగా ఉండదు. ప్రతిదీ మార్పునకు లోనవుతూనే ఉంటుంది. భాష మరీ ఎక్కువగా మార్పు చెందుతూ ఉంటుంది. ఏ భాష కూడా రాత్రికి రాత్రి పుట్టదు. బాహుబలి సినిమాలో కిలికి లాగా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తే తప్ప ఏ భాష వేగంగా పుట్టుకు రాదు. కిలికి లాంటి భాషలను రూపొందించినా అవి వాస్తవ జీవితంలో మనుగడ సాధించడం సాధ్యం కాదు. ఒక తరం మొత్తం కలిసినా ఒక భాషను కొత్తగా తయారు చేయలేదు. ఏ భాష అయినా వందల సంవత్సరాల పాటు క్రమంగా డెవలప్ అవుతుంది. వందలు వేల సంవత్సరాల కిందట ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమాచారం చేరవేయడం కష్టంగా ఉండేది. అందువల్ల తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ భాషలు పుట్టుకొచ్చాయి. ఆ భాషల్లో మళ్లీ ప్రాంతానికి ప్రాంతానికి మధ్య తేడా ఉంటుంది.
మనుషుల్లో అంతరాలు ఉంటాయి. ఉన్న వారు ఉంటారు. లేని వారు ఉంటారు. భిన్న వృత్తుల వారు ఉంటారు. వీరంతా తమ తమ అవసరాలకు అనుగుణంగా భాషను పెంపొందించుకుంటారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారు మాట్లాడుకునే తీరు ఒక లాగా ఉంటుంది. హైటెక్ సిటీలో పెద్ద ఐటీ కంపెనీలో మాట్లాడుకునే భాష ఒక రకంగా ఉంటుంది. ఈ రెండు రకాల మనుషుల మధ్యాల్ని కోపాల్ని, తాపాల్ని వ్యక్తం చేసే తీరు భిన్నంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా పై స్థాయిలో ఉన్న వారికి, పేదరికంలో ఉన్న వారికి; నీటి లభ్యత ఎక్కువగా ఉన్న వారికి, వర్షాభావం అధికంగా ఉండే ప్రాంతాల వారికి మధ్య కూడా మాట తీరులో తేడా ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతి 15-20 కి.మీ.లకు భాషలో తేడా కనిపిస్తుంది. ఒక్క హైదరాబాద్నే తీసుకున్నా పటాన్చెరులో ఉన్న వారిని, హయత్ నగర్లో ఉన్న వారి మాటలను నిశితంగా గమనిస్తే తేడా తెలుస్తుంది.
ఒకే భాష పరంగా వివిధ ప్రాంతాల మధ్య ఉన్న తేడాలను యాసలు అని, మాండలికాలు అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా రాయలసీమ, తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర యాసలు ఉన్నాయి. వీటిలో కూడా జిల్లా జిల్లాకు మధ్య తేడా కనిపిస్తుంది. రాయలసీమను తీసుకుంటే కర్నూలులో మాట్లాడే యాసకు, తిరుపతిలో మాట్లాడే యాసకు తేడా ఉంటుంది. గోదావరి జిల్లాలను తీసుకుంటే కోనసీమకు, మెట్ట ప్రాంతాలకు మధ్య వైవిధ్యం ఉంటుంది. తెలంగాణాను తీసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మధ్య మాటల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇరుగు పొరుగు భాషల వల్ల కూడా ఒక భాష ప్రభావితమవుతూ ఉంటుంది. ఇండియా లాంటి దేశంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
ప్రాంతం, వృత్తి, అంతస్తుతో పాటు ఎన్నో అంశాల వల్ల భాషలో మార్పులు వస్తాయి. ఈ ప్రాథమిక అంశాన్ని ప్రతి పౌరుడు తప్పకుండా తెలుసుకోవాలి. అన్ని భాషలను యాసలను గౌరవించాలి అనే అంశాన్ని పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు తెలియచెప్పాలి. పలు కారణాల వల్ల ఒక భాష వారు.. మరో భాష వారిని, ఒక ప్రాంతం వారు.. మరో ప్రాంతం వారిని, ఒక మతం వారు.. మరో మతం వారిని తూలనాడుతుంటారు. దీనివల్ల సమాజంలో అశాంతి తలెత్తుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు యాసను గౌరవించకపోవడం కూడా ఒక కారణంగా నిలిచింది. సంపన్న ప్రాంతాల నుంచి వచ్చిన డెల్టా ప్రాంత ప్రజలు హైదరాబాద్లో అన్ని రంగాల్లో ముందుకెళ్లారు. ఈ క్రమంలో వీరు తమ యాసకు తగినంత గౌరవం ఇవ్వలేదని స్థానికులు భావించారు. సహజంగానే ముందున్న, పైనున్న వారికి; కింద, వెనుక ఉన్న వారికి మధ్య అంతరం ఉంటుంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి వీలైనంతగా కృషి చేయాలి. అలా కాకుండా అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరిస్తే విపరిణామాలు సంభవించే అవకాశం ఉంది.
——————————————————————————————————————————-
Disclaimer : The opinions expressed here belong solely to the author(s) and are not to be taken as the stated position(s) of Magnon or its subsidiaries.
September 23, 2019 — magnon