అందరు తెలుగు అబ్బాయిల లాగా నా చిన్నతనం కూడా క్రికెట్‌తో నిండి ఉండేది. స్కూల్ నుండి రాగానే ఫ్రెండ్స్‌తో కలిసి ప్రతిరోజూ క్రికెట్ ఆడటం, చెమటలు కక్కుతూ ఇంటికి రావడం. ఇలా ఆడే గల్లీ క్రికెట్‌లో రూల్స్ వేరేగా ఉండేవి. ఉదాహరణకు – బంతిని క్యాచ్ పట్టుకోవడానికి గాలిలో ఎగురుతుండగానే పట్టుకోనవసరం లేదు. ఒకసారి నేల మీద పిచ్ పడి ఆ తర్వాత పట్టుకున్నా అది క్యాచ్ చేసినట్టే లెక్క! అలాగే బంతిని మురికికాలువ లోకి కొట్టిన వాడే వెళ్లి దాని బయటకు తీసి కడిగి తీసుకురావాలి, బ్యాట్ ఎవరిదో వాడే మెదటిసారి బ్యాటింగ్ చేయాలి.. ఇలాంటివి. ఇలా చిన్నపిల్లల జీవితాల్లోనే కాదు మన కుటుంబాల్లో, ఇరుగు పొరుగు వారి ఇళ్లల్లో కూడా క్రికెట్ మ్యాచ్ అంటే ఒక వేడుక లాంటిదే. మ్యాచ్‌ను ప్రతి క్షణం కళ్లప్పగించి చూడడం నుండి ఇండియా గెలుపోటములను బట్టి ఆనంద-నిరాశల వరకు అందరూ తోడుగా పంచుకునే ఒక సాంఘిక కార్యం క్రికెట్.
ఇలా క్రికెట్‌లో పుట్టి పెరిగినటువంటి నేను కూడా ఐపిఎల్ వంటి వాణిజ్యపర క్రికెట్‌ను, అంతే కాక ఆసాంతం క్రీడలనే ఇష్టపడని స్థితికి వచ్చేందుకు కలిగిన కారణాలు చెప్పేందుకు ఈ వ్యాసం రాయాల్సి వచ్చింది. కారణాలకు వెళ్లే ముందు ఒక గమనిక : తాత్వికంగా చూస్తే క్రీడలనేవి మానవ కృషికి, పట్టుదలకు, ఎన్నో ఏళ్ల క్రమశిక్షణ ద్వారా అందుకున్న నైపుణ్యాన్ని గుర్తించి దానిని ప్రదర్శించగలిగే అవకాశాన్ని కల్పించే ఒక వేదిక. సచిన్ ఆడే ప్రతి స్ట్రయిట్ డ్రైవ్‌లో , మురళీధరన్ బంతి మయాజాలంలో ఎన్నో ఏళ్ల కృషి, ఏకాగ్రత ఉన్నాయని ఒప్పుకుంటూనే, వారి నైపుణ్యాన్ని ఏ విధంగానూ కించపరిచే ఉద్దేశ్యం లేకుండానే క్రీడల పట్ల ఈ విమర్శను అందిస్తున్నాను :
క్రికెట్‌లోనే కాక సాధారణంగా క్రీడలలో మూడు అంశాలు ప్రధానంగా నా విమర్శకు కారణాలు – వ్యాపారీకరణ, స్వదేశాధిపత్యభిమానం, వినోదం మీద దృష్టి.
వ్యాపారీకరణ
క్రికెట్ అనేది ఒక సంక్లిష్టమైన వ్యూహంతో ఆడాల్సిన ఆట. అలాంటి ఆటను వాణిజ్యపరంగా, లాభాలను పెంచుకోవడానికి హైలైట్‌లు మాత్రమే ఉండే ఒక నకిలీ క్రికెట్‌ను టీ20ల రూపంలో సృష్టించారు. ఇలా వ్యాపారీకరించడం వలన టీ20లలో వీక్షకులు వినియోగదారులుగా పరిగణించబడతారు. దీని వల్ల వారి దృష్టిని పూర్తిగా, నిరంతరాయంగా ఆకర్షించడం కోసం క్రికెట్‌లోని ఎన్నో అంశాలను తొక్కివేశారు. ఉదాహరణకు – క్రికెట్ పిచ్‌ని బ్యాటింగ్‌కి అనుకూలంగా మార్చి సిక్స్‌లు ఫోర్‌లు ఎక్కువగా వచ్చేలా చేశారు. ఎందుకంటే వికెట్లు పడటంతో పోలిస్తే, పక్కా లైన్, లెంగ్త్ తో వచ్చే బౌలింగ్ ధాటిని తట్టుకుని డిఫెన్సివ్‌గా ఆడే బ్యాటింగ్ తో పోలిస్తే, సిక్స్‌లు ఫోర్‌లలో వినోదం పాళ్లు ఎక్కువ కాబట్టి. ఇలా వినియోగదారులకు కావలసిన కనీస వినోదాన్ని అందించి వారి నుండి వీలైనంత రాబడి జుర్రుకుంటారు. అందుకే అంటారు టెస్ట్ క్రికెట్ మాత్రమే అసలైన క్రికెట్, మిగితా అన్ని ఫార్మాట్‌లు రంగు-చొక్కాల-సర్కస్ అని నిష్ణాతులు, మేధావులు విమర్శిస్తూ ఉంటారు (టెస్ట్ క్రికెట్ కాని మిగితా ఫార్మాట్‌లలో తెల్ల దుస్తుల బదులు రంగు జెర్సీ లు వేసుకుంటారు కదా!).
ప్రపంచవ్యాప్త క్రికెట్ సంస్థలలోకెల్లా అత్యంత ధనవంతమైన బీ.సీ.సి.ఐ మీద ఉన్న విమర్శలను మీరు వినే ఉంటారు – భారీ స్థాయిలో అవినీతి, ఆటగాళ్లను ఎంపిక చేయడంలో పక్షపాతం, వ్యాపార వ్యవహారాల్లోనే కాక నిర్ణయాలు తీసుకోవడంలో ఏ మాత్రం పారదర్శకతను పాటించకపోవడం వగైరా వగైరా. ఇటీవల ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సుప్రీం కోర్టు బీ.సీ.సీ.ఐ.ని ప్రక్షాళన చేయమని జస్టిస్ లోధా నాయకత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ సిఫార్సులు ఎంతమేరకు అమలవుతాయో వేచి చూడాలి. సులువుగా అమలౌతాయనుకోవడం భ్రమే అవుతుంది.
స్వదేశాధిపత్యభిమానం
పైన పేర్కొన్న కారణాల వల్ల నేరుగా మన మీద ప్రభావం పడకపోవచ్చు. కానీ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు ఉబికిపడే స్వదేశాధిపత్యభిమాన (jingoism) ధోరణి మీకు తెలిసే ఉంటుంది. భారత క్రికెట్ జట్టును అభిమానించడం అనేది దేశభక్తితో సమానంగా భావింపజేసి దానిని ఏకీభవించని వారిని దేశద్రోహులుగా చిత్రీకరించి వారిపై భౌతికంగా దాడి చేయడం వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. నిజంగా క్రీడలలోని గొప్పదనాన్ని చూసే వారు, క్రీడాకారుల నైపుణ్యాన్ని, వ్యూహరచనను ప్రాతిపదికగా వారిని అభిమానించే వారు, దేశాల మధ్యన ఉన్న సరిహద్దులను లెక్కచేయరు. ఇటువంటి వెర్రి స్వదేశాధిపత్యభిమానం ముఖ్యంగా భారత్ పాక్ మ్యాచ్‌లన్నింటిలోనూ కనిపిస్తుంది. దురదృష్టవశాత్తూ దీనిలో భాగంగా మన దేశ ముస్లిములు కూడా వివక్ష అనుభవించడం జరుగుతూ ఉంటుంది.
వినోదం మీద దృష్టి
పైన వివరించిన కారణాలే కాకుండా క్రీడలకు వచ్చే అమితమైన ప్రజాదరణ నా దృష్టిలో చాలా వింతైనది. ఎందుకంటే క్రీడలలోని నియమాలు యాదృచ్చికంగా మనుషులు చేసినవి. ఇలాంటి నియమాలను క్రమం తప్పకుండా అనుసరించి చేయడం అన్నదే ఒక నైపుణ్యంగా పిలవబడుతుంది. ఈ చెక్క ముక్కని ఇలా తిప్పడం ప్రపంచంలో ఎవ్వరికీ చేతకాదు తెలుసా! అలా చూస్తే వీధిలో తమ వింత నైపుణ్యాలను (ఉదా. ఇంద్రజాలం, కర్రసాము, నాలిక మీద కత్తిని బ్యాలెన్స్ చేయగలగడం) ప్రదర్శించి డబ్బు అడిగే వారు కూడా క్రీడాకారులే అవుతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త, మేధావి నోఅమ్ చోమ్స్కీ క్రీడలను ప్రజల ఏకాగ్రతను, సమయాన్ని వ్యర్థం చేసి వారిని వినోదమత్తులో ఉంచే సాధనాలని విమర్శించారు. ఈ మాటలు కఠినంగా తోచినా వీటిలో నిజం లేకపోలేదు. మన దేశ పౌరుల్లో (నాతో సహా) సామాజిక రాజకీయ అంశాలతో పోలిస్తే క్రికెట్ లాంటి క్రీడల మీద ఆసక్తి, వాటి జ్ఞానం రెండూ ఎన్నో వేల రెట్లు ఉంటుంది.
రోమన్ సామ్రాజ్యంలో కొలీజియమ్ అనే ఒక బహిరంగ ప్రాంగణంలో ప్రజల వినోదార్థం హింసాత్మక పోటీలను నిర్వహించేవారు. వీటిలో బానిసలు క్రూర జంతువులతో పోటీ పడుతూ వారి ప్రాణాలను కాపాడుకోవడం కూడా ఒక ఆట లాగే చూసి చప్పట్లు కొట్టేవారు. అలాంటి వారసత్వం కలిగిన నేటి ఆధునిక క్రీడల్లో కూడా భౌతిక గాయాలు లేకపోలేదు. ఇటీవల ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూగ్‌స్ బౌలర్ వేసిన బంతి తలకు తగిలి ఆ గాయంతోనే మరణించాడు. క్రికెట్ లాంటి క్రీడలలో ఇలా ఉంటే బాక్సింగ్ లాంటి ఇతర క్రీడల్లో ఎంతమేరకు ప్రమాదం పొంచి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయమేంటంటే క్రికెట్‌లో హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేయడాన్ని ఒక గొప్పదనంగా భావించే వాళ్లు కూడా ఉన్నారు. తమను తాము సైనికుల్లా భావించుకుని ఎటువంటి భద్రతా సామాగ్రి లేకుండా శత్రువును నేరుగా ఎదుర్కొందామనే ఒక వింత ఆత్మాభిమానం కూడా క్రీడాకారులలో ఉందంటే ఈ క్రీడాభిమానం ఎంతగా పెరిగిపోయిందో అంచనా వేయవచ్చు.
పైన పేర్కొన్న కారణాలు మిమ్మల్ని ఒప్పించగలిగాయా? ఇవే కాక వేరే కారణాలు కూడా ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని క్రింద ఉన్న కామెంట్ బాక్సులో మాకు తెలియజేయండి!
April 30, 2018 — magnon